– సామర్ధ్యాన్ని మించి పశువుల రవాణా
– అధిక ధరలు వసూళ్లు
– పట్టించుకోని అధికారులు
బూర్గంపహాడ్, జూన్ 26 : బూర్గంపహాడ్ మండలంలో అతిపెద్ద సంతగా పేరున్న మోరంపల్లిబంజర్ సంతలో నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. వారంలో బుధ, గురు, శుక్రవారాల్లో జరిగే పశువులు, కూరగాయల విక్రయాల్లో నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా వినవస్తున్నాయి. సంత నిర్వాహకులు నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ మొత్తంలో వ్యాపారుల నుండి వసూలు చేయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిరువ్యాపారులు తమకు కేటాయించిన స్థలాలకు నిర్ణయించిన ధర కాకుండా అధికంగా ధర వసూలు చేస్తున్నారని దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసినా తమకు రాని ఆదాయం ఈ అధిక వసూళ్లతో నష్ట పోతున్నామని వాపోతున్నారు. ధర వసూలు చేసినా తిరిగి రశీదులు కూడా ఇవ్వడం లేదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారంలో మూడు రోజులు నడిచే ఈ సంతలో అధిక ధరలు వసూలు చేయడంతో పాటు పశువుల విక్రయాల్లో నిబంధనలను నిర్వాహకులు పట్టించుకోకుండా 13 శాల్తీలే లోడు చేయాల్సి ఉండగా అంతకంటే అ ఎక్కువ మొత్తంలో పశువులను వాహనాల్లో తరలించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సంత నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరుపై పంచాయతీ అధికారులు సైతం నోరుమెదపకపోవడంతో సంతకు వచ్చే ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూళ్లు చేస్తున్న సంత నిర్వాహకులపై తగినచర్యలు తీసుకోవాలని ప్రజలు, చిరు వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.