రామవరం, ఏప్రిల్ 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసించిన 2007-10 బ్యాచ్ సివిల్ డిప్లొమా విద్యార్థులు మంగళవారం కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 15 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న వారంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రస్తుత ప్రిన్సిపల్, మాజీ సివిల్ లెక్చరర్ వెంకటేశ్వర్లు, వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ న్యూరి, ఫిజిక్స్ లెక్చరర్ వినోద్, డ్రాయింగ్ లెక్చరర్ సుబ్రహ్మణ్యం, విశ్రాంత ఉద్యోగి పాషా, ఇతర అధ్యాపకులను వారు ఘనంగా సన్మానించారు.
ప్రిన్సిపాల్ సూచన మేరకు కళాశాల భవన మరమ్మతులకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన తమ తోటి స్నేహితుడు నాగేశ్వరరావు, తమకు విద్యాబుద్ధులు నేర్పిన సివిల్ హెచ్ఓడీ సత్యనారాయణ రెడ్డికి నివాళులర్పించారు. నాగేశ్వరరావు కొడుకు విద్యావసరాల కోసం రూ.లక్ష వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మంతెన బాలకృష్ణ, బజార్, కీర్తి, స్వర్ణలత, సిద్ధార్థరెడ్డి, చైతన్య, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.