పాల్వంచ, ఏప్రిల్ 06 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సోమవారం పాల్వంచ బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ మార్గం గుండా వెళ్తూ ఆయన పాల్వంచ బస్టాండ్‌లో ఆగి బస్టాండ్‌లో ఉన్న వసతి సౌకర్యాలను పరిశీలించారు. బస్టాండులో మలమూత్ర విసర్జన శాలలు సక్రమంగా పని చేయడం లేదని, అలాగే వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్టాండ్ సక్రమంగా లేదని దాన్ని పూర్తిస్థాయిలో బాగు చేయించాలని, పాల్వంచ బస్టాండ్ లోకి ప్రయాణికులు వచ్చి పోయేందుకు, వాహనాలు తీసుకుని లోపలికి రావాలన్నా పలు ఇబ్బందులు పడుతున్నారని విషయంపై బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు తపస్వి ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
అలాగే సామాజిక సేవా కార్యకర్త ఎడ్లపల్లి శ్రీనివాస్ బూర్గంపాడు బస్టాండ్ ను కూడా వినియోగంలోకి తీసుకురావాలని, అవసరమైతే భద్రాచలం పేపర్ బోర్డు వాళ్లతో మాట్లాడి బస్టాండు కు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెప్పించాలని కోరారు. ఆర్టీసీ ఎండీ వస్తున్న విషయం తెలుసుకుని పాల్వంచలోని కార్పొరేటర్లు అడుసు మిల్లు సాయిబాబా, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, ఖమ్మం డిప్యూటీ ఆర్ ఎం మల్లయ్య, కొత్తగూడెం డిఎం రాజ్యలక్ష్మి, పలువురు అధికారులు హాజరయ్యారు.