– జామాయిల్ కర్రలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు
– ఇద్దరి పరిస్థితి విషమం, ముగ్గురికి గాయాలు
– క్షతగాత్రులు సిద్ధిపేట వాసులు
బూర్గంపహాడ్, మే 12 : హనుమాన్ జయంతి నేపథ్యంలో దైవ దర్శనం కోసం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా బూర్గంపహాడ్ మండలం సారపాక వద్ద జామాయిల్ కర్రలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుండి కారు ఢీకొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా నంగనూర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన పులిగిళ్ల లింగప్రసాద్, నక్కా కుమార్‌యాదవ్, బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, నాయిని సంపత్‌రెడ్డి, చంద్రశేఖర్ కారులో భద్రాచలం దేవాలయానికి వెళ్లారు. వీరంతా దీక్ష తీసుకుని ఉండడంతో దర్శనం అనంతరం దీక్షలు విరమించి తిరుగు ప్రయాణంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే క్రమంలో బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ సమీపంలో ఎదురుగా జామాయిల్ కర్ర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ మలుపు తిరుగుతుండగా వెనుక నుండి కారు ఢీకొట్టింది.
ఈ సంఘటనలో కారులో ప్రయాణీస్తున్న మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న పులిగిళ్ల లింగప్రసాద్, ఎ.చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలు కాగా మిగిలిన ముగ్గురు న్యాయవాదిగా పనిచేస్తున్న నక్కా కుమార్ యాదవ్, బైక్ మెకానిక్ బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, నాయిని సంపత్‌రెడ్డికి గాయాలయ్యాయి. వీరిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా లింగప్రసాద్, చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని, అకస్మాత్తుగా మలుపు తిప్పడంతో వెనుక నుండి వచ్చే వాహనం ఢీకొట్టి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.