రామవరం, జనవరి 16 : ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి ప్రతాప్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్, రవాణా, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమమే Arrive-Alive-2026 అని ఆయన తెలిపారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీఎం కార్యాలయం, రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు.
రోడ్డుపై విధుల్లో పోలీసులు ఉన్నా, లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు,ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని ఉద్యోగులు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. అనంతరం రక్షణ సూత్రాలను పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ఏరియా రక్షణాధికారి ఎం.వెంకటేశ్వర్లు, డిజిఎం (ఐఈ) ఎన్.యోహాన్, మేనేజర్ ఐటీ కె.శేషా శ్రీ, మాతా శిశు ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.