ఇల్లెందు, సెప్టెంబర్ 13 : గ్రూపు-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి, విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ ఇల్లెందు నియోజకవర్గ విద్యార్థి విభాగ నాయకుడు కాసాని హరిప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఉద్యోగం సాధించాలనే తెలంగాణ నిరుద్యోగ యువత ఆశలపై టీజీపీఎస్సీ నీళ్లు చల్లిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు శనివారం జెకె కాలనీలో గల గ్రంథాలయం వద్ద బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ అవకతవకలకు పాల్పడిందన్నారు.
కేవలం రెండు సెంటర్ల నుండే 74 మంది ర్యాంకర్లు ఉండటం పట్ల అనేక అనుమానాలకు తావు ఇస్తుందని, ఇప్పటికీ ఈ విషయంలో హైకోర్టుకు టీజీపీఎస్సీ వివరణ ఇవ్వకపోవడం అనేక అవకతవకలు జరిగాయని అర్థం అవుతుందన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిన కుట్ర అని, దీని వెనక చాలా మంది పెద్దల హస్తం ఉందన్నారు. గతంలో ఆరు నెలల క్రితమే గ్రూప్ వన్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, అనేక కోట్ల రూపాయల వ్యాపారంతో గ్రూపు వన్ అభ్యర్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యార్థుల కష్టంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి బేషజాలకు వెళ్లకుండా పరీక్షను తిరిగి నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు భూక్య సురేశ్, నెమలి నిఖిల్, ఇంతియాజ్, వైకుంఠం, బిపిన్ నాయక్, ఎస్.కె చాంద్ పాషా, గండమల్ల రామకృష్ణ, గౌస్ పాషా, సోను, కిరణ్, కొండ్రు.రవికాంత్, ఎస్కే.వలి, ఎస్కే.సమీర్, ఎస్కే.సఫిక్, ఎస్కే.సోహెల్ పాల్గొన్నారు.