బచ్చన్నపేట ఫిబ్రవరి 3 : జనగామ జిల్లాలోని కొడవటూరు కమాన్ క్రాస్ నుంచి బచ్చన్నపేట ఎస్సార్ పెట్రోల్ బంక్ వరకు గుంతలమయంతో అధ్వానంగా మారిన జనగామ- సిద్దిపేట రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ ఫైట్ ఫర్ బచ్చన్నపేట ఆధ్వర్యంలో మంగళవారం భారీ రాస్తారోకో ధర్నా నిర్వహించారు. రెండు గంటల పాటు నిర్వహించిన ధర్నాలో జనగామ, ఆలేరు, సిద్దిపేట వైపు వెళ్లే వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా పలువులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం మూలంగా ప్రతిరోజు ఎంతోమంది ఈ గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారని అన్నారు. బైకులపై వెళ్లిన పలువురు యువకులు మృతి చెందిన సంఘటనలు ఎన్నో జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు పత్రికల ద్వారా సమస్యను విన్నవించిన కూడా అధికార యంత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవ రిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న వారి షాపుల్లోకి విపరీతంగా దుమ్ము వెళ్లడంతో వారు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. మాస్క్ పెట్టితేనే షాపు తెరవాలే తప్ప, వేరే మార్గం లేదన్నారు. కలెక్టర్ రావాలి. రోడ్డు నిర్మాణం పై హామీ ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా విరమించాలని ఎస్ఐ హమీద్ కోరిన వారు వినలేదు. జిల్లా స్థాయి అధికారులు రావాలి, తమకు కచ్చితంగా హామీ ఇవ్వాలి అంటూ మొండికేశారు.
విషయం తెలుసుకున్న తహసిల్దార్ హస్సేన్ రాస్తారోకో వద్దకు వచ్చి, రోడ్డు నిర్మాణంపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి, పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో ఫైట్ ఫర్ బచ్చన్నపేట యూత్ సభ్యులు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.