కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 08 : కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని, టీడీపీలో డబ్బు సంచులతో దొరికి ఆ పార్టీని బొందపెట్టాడని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీని రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసేలా పాలన సాగిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. బుధవారం కొత్తగూడెం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకువచ్చిన 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు మంగళం పాడుతూ ఆ పార్టీని నాశనం చేసే విధంగా రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని, దీనిపై అసలు కాంగ్రెస్ నాయకులు నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. పేదవాడి ఆరోగ్యం కోసం తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ పథకానికి నిధులు కేటాయించకుండా, ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదని, 108 అంబులెన్స్ లకు డీజిల్ లేక మూలకు పడ్డట్లు తెలిపారు. పేద విద్యార్ధులు గొప్ప గొప్ప చదువులు చదువుకోవాలని ఆనాటి సీఎం వైఎస్ఆర్ తెచ్చిన ఫీ రీయింబర్స్మెంట్ పథకంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఫలితంగా కళాశాల యాజమాన్యాలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. గత మార్చిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని, మార్చి తర్వాత ప్రతీ నెలా చెల్లిస్తామని కళాశాలల యాజమాన్యాలకు హామీ ఇచ్చిన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, ఫలితంగా వారు ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్లు కమీషన్లు చెల్లించలేమని ఏకంగా సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముందే ధర్నా చేయడమంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్ల దందా ఏ విధంగా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. అందుకే భట్టి విక్రమార్క పేరు వాయిదాల మంత్రి, వాటాల మంత్రి అని, కమీషన్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్లు బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. దళిత, ఆదివాసీ, గిరిజన విద్యార్థుల కోసం తీసుకువచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(బాస్) కు గత 22 నెలలుగా నిధులు కేటాయించక పోవడంతో విద్యార్ధులు పలక, బలపం పట్టుకుని రోడ్డెక్కారని, ఇది ముమ్మాటికి వారికి విద్యను దూరం చేయడమేనన్నారు. స్కూల్‌కు రూ.180 కోట్ల బకాయిలు చెల్లించడానికి చేతులు రావడం లేదు కానీ, సీఎం ఢిల్లీ వెళ్లడానికి, మంత్రులు హెలికాప్టర్లలో తిరగడానికి, అందాల పోటీలు నిర్వహించడానికి వందల కోట్ల రూపాయలను నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారని, గురుకులాల్లో విద్యార్ధులకు నాణ్యమైన భోజనం పెట్టడానికి వెనుకాడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ పాలనలో గురుకులాలకు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు మాజీ సీఎం కేసీఆర్ ఏ లోటు రానీయకుండా విద్యార్ధుల భవిష్యత్‌కు బంగారుబాటలు వేస్తే నేడు రేవంత్ రెడ్డి వారిని రోడ్డుపాలు చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాడని దుయ్యబట్టారు. గురుకులాల్లో విద్యార్థుల మరణ మృదంగంతో తల్లిదండ్రులు బాధపడుతుంటే, మరో వైపు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు మంగళం పాడుతూ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ కాంగ్రెస్ నాయకులు తమ జేబులను నింపుకునే పనిలో పడ్డారని విమర్శించారు. యూనివర్శిటీ నిర్వహకులే పరీక్షలను వాయిదా వేశారంటే ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. చిన్న వాళ్ల నుంచి ముసలివాళ్ల వరకు ప్రతీ ఒక్కరూ సమస్యల పరిష్కారం కోసం ఏదోచోట ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ అంటూ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుందని, ఎలాగైనా అధికారంలోకి రావాలని అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని ఆ హామీలన్నింటినీ అమలు చేసేదాకా వెంటపడుతూనే ఉంటామని, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రతీకార, పైశాచిక పాలన చేస్తున్న సీఎం రేవంత్‌ను చూస్తుంటే తానే కాంగ్రెస్ పార్టీలో తొలి, ఆఖరు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారేమోనని, అందుకే కాంగ్రెస్ పార్టీని వంద అడుగుల లోతులో బొందపెట్టే పనులకు ఆయన శ్రీకారం చుట్టారన్నారు. సీఎం వచ్చే ఎన్నికల మరించి ఆలోచిస్తున్నారని, వచ్చే జనరేషన్ కోసం ఆలోచన చేయడం లేదని అందుకే విద్యాశాఖ మంత్రిగా తాను ప్రసంగాలకే తప్పా క్షేత్రస్థాయిలో విద్యాశాఖపై దృష్టి సారించడం లేదన్నారు. ఇప్పటికైనా సీఎం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులు మంజూరు చేసి పట్టాలెక్కించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ తొగరు రాజశేఖర్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సంకుబాపన అనుదీప్, నాయకులు జయరాం, మునీర్, రిజ్వాన్, భూపతి శ్రీనివాస్, పూల రవీందర్ పాల్గొన్నారు.