జూలూరుపాడు, సెప్టెంబర్ 07 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీ 1000 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన మండల ఎంపీడీఓ తాళ్లూరు రవికి స్థానిక నాయకులతో కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రజలకు బాకీ పడ్డ పథకాలను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసిందన్నారు. హామీలు నెరవేర్చకుండా కేవలం మాజీ సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. రూ.2,000 ఉన్న ఆసరా పెన్షన్ను రూ.4,000 చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదని, ఇందుకు నిరసనగానే పలు కార్యక్రమంలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. అలాగే, ఏటా 2 లక్షల ఉద్యోగాల కల్పన, విద్యార్థినులకు స్కూటీలు, విదేశీ విద్యకు ఆర్థిక సాయం తదితర హామీలు బుట్టదాఖలు కావడంతో వైరా పట్టణ కేంద్రంలో ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు.
గత 33 నెలలుగా పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం భారీ మొత్తంలో బాకీ పడిందని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్, నీటితీరువా రద్దు, రైతుబంధు వంటి పథకాలతో రైతాంగం సంతోషంగా ఉంటే నేడు ఎరువుల కొరత, కొత్త యాప్ల పేరుతో రైతులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల అమలులో సర్కార్ విఫలమైందన్నారు. స్థానిక నాయకులు సైతం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, ఈ పరిస్థితులపై నిలదీసేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు చాపలమడుగు రామ్మూర్తి, ఉప సర్పంచ్ బాదావత్ నరేష్, పురస్తపురవు రామకృష్ణ, పోతురాజు రామారావు, ఇల్లంగి తిరుపతి, భూక్యా జబ్బర్, యువజన నాయకులు రామిశెట్టి వంశీ, బానోత్ హనుమంత్ రావు, పోతిన్ని రాంబాబు, చింతపట్ల నరసింహారావు తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.