చుంచుపల్లి, అక్టోబర్ 05 : చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాకు చెందిన ధరావత్ హరికృష్ణ (37) ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. హౌసింగ్ బోర్డు నుండి చుంచుపల్లి తండాకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో హరికృష్ణ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న హరికృష్ణ ప్రమాదానికి గురై మృతి చెందడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా దాడి చేసి అనంతరం ప్రమాదంగా చిత్రీకరించి ఉండొచ్చన్న అనుమానాలను మృతుడి బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.