పాల్వంచ, జూలై 14 : కేటీపీఎస్ 8వ దశ నిర్మాణం చేపట్టాలని కోరుతూ కేటీపీఎస్ 8వ దశ సాధన సమితి సోమవారం టీజీ జెన్కో సీఎండీ హరీశ్‌కు వినతిపత్రం అందజేసింది. హైదరాబాద్‌లో విద్యుత్ సౌదాలో పాల్వంచకు చెందిన కేటీపీఎస్ 8వ దశ సాధన సమితి సమావేశం చైర్మన్ సీతారాం రెడ్డి అధ్యక్షత, కన్వీనర్ మంగీలాల్ సమక్షంలో జరిగింది. పాల్వంచ పట్టణంలో ఉన్న కేటీపీఎస్ పాత ప్లాంట్ ప్రాంగణంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలనే ప్రధాన లక్ష్యంతో సమావేశం నిర్వహించారు. ఈ అంశంపై సీఎండీ స్పందిస్తూ.. విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం సాధన సమితి ప్రతినిధులు టీజీ జెన్కో డైరెక్టర్లు హెచ్ఆర్ కుమార్ రాజ్, ధర్మల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ కమర్షియల్ డైరెక్టర్ నాగయ్య, ఈడీ డైరెక్టర్ లక్ష్మయ్యను కలిసి పవర్ ప్రాజెక్ట్‌పై అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1104 జెన్కో అధ్యక్షుడు కేశబోయిన కోటేశ్వరరావు, ఎస్టీ అసోసియేషన్ నాయకుడు ప్రవీణ్, ఇంజినీరింగ్ అసోసియేషన్ తరపున నెహ్రూ వెంకట్ నారాయణ రెడ్డి, ఏఐటీసీ సుమన్, వెంకటేశ్వర్లు, H82 యూనియన్ వెంపటి అనిల్ కుమార్ పాల్గొన్నారు.