జూలూరుపాడు, మే 06 : సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు ఇవ్వాలని, అలాగే జూలూరుపాడులో శాశ్వత మార్కెట్ నిర్మించాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలని కోరుతూ మండల పర్యటనకు వచ్చిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రారంభమైన సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇక్కడి పొలాలకు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సీతారామ ప్రాజెక్ట్ పై నిర్ణయం తీసుకుందామని చెప్పి ఇప్పటి వరకు సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు.
సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాలకు ఇవ్వాలని, పోడు భూములన్నిటిని సాగులోకి తీసుకురావాలన్నారు. అలాగే జూలూరుపాడు మండలంలో శాశ్వత మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కావునా శాశ్వత మార్కెట్ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.ఇందిరమ్మ ఇల్లు నిజమైన పేదవారికి ఇవ్వాలని, రాజీవ్ యువ వికాస పథకం అందరికీ వర్తింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జూలూరుపాడు మండల కార్యదర్శి వల్లోజు రమేశ్, నాయకులు రాములు, కల్తి నరసింహారావు, రాధాకృష్ణ పాల్గొన్నారు.