జూలూరుపాడు, మార్చి 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న సబ్ మార్కెట్ యార్డును శాశ్వత మార్కెట్ గా ఏర్పాటు చేసి తక్షణమే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి క్యాంప్ ఆఫీస్ పర్సనల్ సెక్రెటరీకి, ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి గిరిజన సంఘాల నాయకులు శుక్రవారం సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర నాయకులు ధర్మ, ఎల్ హెచ్ పి ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుబు కేశవ్ నాయక్, గిరిజన సంఘం జిల్లా నాయకుడు బానోతు మధు నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి లకావత్ నాగేశ్వర్రావు నాయక్ మాట్లాడుతూ.. జూలూరుపాడు మండలంలోని ఉప మార్కెట్ యార్డ్ గత 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు అయినట్లు చెప్పారు. ప్రతి ఏటా పత్తి అమ్మకం, కొనుగోలు చేపడుతుందన్నారు.
ఈ మార్కెట్ పరిధిలో అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, హమాలీల జీవన కొనసాగుతుందని తెలిపారు. ఈ మార్కెట్ లావాదేవీలతో ప్రభుత్వానికి సెస్ రుసుముగా రూ.3 కోట్ల ఆదాయం సమకూరుతున్నట్లు చెప్పారు. కానీ సబ్ మార్కెట్‌ను శాశ్వత మార్కెట్‌గా అభివృద్ధి చేసే దాంట్లో ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని విమర్శించారు. ఈ మార్కెట్ యార్డు నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ 10 ఎకరాల భూమి కేటాయించినప్పటికీ దాన్ని అభివృద్ధి చేసే విషయంలో అధికారులు విఫలం చెందుతున్నారు.
ఇన్ని రకాల సౌకర్యంగా ఉన్న ఉప మార్కెట్ యార్డ్ ను తక్షణమే అభివృద్ధి చేయాలన్నారు. రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా రైతుల పంట ఉత్పత్తులకు రక్షణ ఇచ్చే విధంగా మార్కెట్ వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, హమాలీ కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు భూక్య శివ, జై నరసింహ రావు, బీ. ఈరు, భూక్య రవి, శంకర్, బద్రు, రాములు, గతం బాబురావు, పప్పుల జాను, పోతురాజు బోడయ్య , ఇల్లంగి సుందర్రావు, మంద నరసింహారావు, కాకటి ప్రతాప్, వలమల చందర్రావు, గతం భాస్కర్, బోరం నరసింహారావు పాల్గొన్నారు.