పాల్వంచ, జనవరి 26 : పాల్వంచ పట్టణంలోని ఒడ్డుగూడెంలో గల దారుల్ ఉలూం నూరియా హనఫియా మదర్సాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్సా చైర్మన్ ఎండీ యాకుబ్ పాషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డా.బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 26 నవంబర్, 1949న ఆమోదించబడి, 26 జనవరి, 1950 నుండి అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలిచిందన్నారు.
ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను పాటిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించగా, దేశభక్తి నినాదాలతో మదర్సా ప్రాంగణం మార్మోగింది. కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ ఐక్యత భావనలు మరింత బలపడ్డాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్సా ప్రధాన కార్యదర్శి దస్తగిర్, కోశాధికారి ఇక్బాల్, అకౌంట్ హెడ్ గౌస్ పాషా, ఇంచార్జి గుంశావలి, ప్రిన్సిపాల్ తౌసిఫ్ రజా పాల్గొన్నారు.