కొత్తగూడెం అర్బన్, మే 28 : కొత్తగూడెం మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని సీపీఐ ఎంఎల్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులు బుధవారం కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం అందజేసి సమస్యలను వివరించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కొత్తగూడెం మున్సిపాలిటీకి కమిషనర్ లేకపోవడంతో ప్రజాపాలన ఇబ్బంది అవుతుందని, తక్షణమే పర్మినెంట్ కమిషనర్‌ను నియమించాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పాల్వంచ కమిషనర్, అశ్వరావుపేట, కొత్తగూడెంకు ఒక్కరే ఇన్చార్జిగా ఉండటం వల్ల ప్రజా పాలనకు ఇబ్బంది అవుతుందనీ, ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రాజీవ్ వికాసం లాంటి పథకాలు విషయంలో ప్రజలు కలిసేందుకు ఇబ్బందికరంగా ఉందన్నారు.
అశ్వరావుపేట, పాల్వంచ, కొత్తగూడెంకు దూర ప్రయాణం కావడంతో ప్రయాణ భారం కూడా పెరిగి ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఉందన్నారు. రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో పారిశుధ్యం లోపిస్తుందని, పార్కుల్లో చెత్త పెరిగిపోతుందని, అర్హులైన వారికి పథకాలు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని, ఎవరిని అడగాలో అర్థం కావడం లేదన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ సెంటర్, జిల్లా కేంద్రం కావడంతో లక్షలాది మంది ప్రజలు ఉండడంతో రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు ముసలి సతీశ్, సరస్వతి, నరసింహారావు, జోగారావు, మారుతి రావు, సురేశ్ పాల్గొన్నారు.