బూర్గంపహాడ్, మే 02 : కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి హెచ్చరించారు. శనివారం రిలే నిరాహారదీక్షలు 38వ రోజుకు చేరుకోవడంతో దీక్షల్లో గాడిద సుధాకర్, ఐనవోలు లక్ష్మణరావు, బండ ప్రవీణ్, ఇమ్మడి నరేంద్రలు కూర్చోగా జేఏసీ కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఆనికి సర్వేశ్వరరావు, బోడేపూడి కిషోర్ పూలమాలలు వేసి మద్దతు పలికారు. 38 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్నా ఐటీసీ యాజమాన్యం కార్మిక సమస్యలపై కన్నెత్తి చూడకపోవడం సిగ్గుచేటన్నారు.
కార్మికుల కష్టంతో లాభాలు అర్జిస్తున్న ఐటీసీ యాజమాన్యానికి కార్మికుల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు. 14వ వేతన ఒప్పందం జేఏసీ నాయకులతో కలిసి చేయాలని, 13వ వేతన ఒప్పందం పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని, నేడో, రేపో సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులు, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.