రామవరం, మే 12 : ట్రేడ్ యూనియన్లు చేయని పనులు ఒక వ్యక్తిగా, వ్యవస్థగా తయారై కాంట్రాక్ట్ కార్మికులకు కావాల్సిన హక్కులను సాధించడంలో రాసూరి శంకర్ చేసిన కృషి మరువలేనిది, మర్చిపోలేనిది అని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు సంకు బాపన అనుదీప్ అన్నారు. ఆదివారం రాత్రి సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ మార్కెట్ సెంటర్లో కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు, టీబీజీకేస్ సెంట్రల్ కమిటీ మెంబర్ రాసూరి శంకర్ సంస్మరణ సభను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన జీవిత చరిత్రను, కాంట్రాక్టు కార్మికుల కోసం ఆయన చేసిన పోరాటం, సాధించిన హక్కులను డిజిటల్ బోర్డు ద్వారా సభకు వచ్చిన వారికి చూపించారు.
సభకు కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు గూడెల్లి యాకయ్య సభ అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు లగడపాటి రమేశ్, ఇతరులు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు హాస్పిటల్ బుక్కులను అందించిన ఘనత రాసూరికే దక్కుతుందన్నారు. సొంత ఖర్చులతో బుక్కులను ముద్రింపజేసి కాంట్రాక్ట్ కార్మికులు అందించారని, అంతేకాకుండా వారికి రావాల్సిన ప్రతి హక్కును కొట్లాడి ఇప్పించడంలో రాసూరి పాత్ర మరువలేనిదన్నారు. నాడు సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ప్రక్రియ సంవత్సరానికి 10 మంది చొప్పున ఇచ్చేవారని, దీంతో సంవత్సరాలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చేదని, దీనిని ఒకే దఫాలో ఇప్పించడంలో ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. సామాజిక బాధ్యతగా మరణాంతరం ఆయన కండ్లను కూడా దానం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు,
కాంట్రాక్ట్ కార్మికులకు వారి హక్కులకు భంగం కలిగితే పగలు రాత్రి చూడకుండా ముందు వరుసలో ఉండి తాను సింగరేణి ఉద్యోగస్తుడు అయి ఉండి కూడా సింగరేణి సంస్థతో కొట్లాడిన కార్మిక పక్షపాతి అన్నారు. రాసూరి మరణం కాంట్రాక్ట్ కార్మిక లోకానికి తీరని లోటుగా మిగిలిపోయిందన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియుసి రాష్ట్ర నాయకులు మధు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు యాకుబ్ షావలి, టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ, మారపాక రమేశ్, కాంగ్రెస్ నాయకులలు బాలచౌరి, అబ్దుల్ బషీద్, తగర రాజశేఖర్, అనిల్, సాదిక్ విజయ్, షకీల్, నాగుల్ మీరా, సమ్మయ్య, రవి, మడిపల్లి కరుణాకర్, మహబూబ్ పాషా, మోతి, కాంట్రాక్ట్ కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Ramavaram : ‘రాసూరి మరణం కాంట్రాక్ట్ కార్మిక లోకానికి తీరని లోటు’