బీజింగ్, మార్చి 18: ‘అబ్బా ఎప్పుడూ చదువులు.. ర్యాంకులేనా? కాసింత కళాపోషణ కూడా ఉండాలి కదా’ అంటూ చైనాకు చెందిన యూనివర్సిటీలు యువతను ప్రేమలో పడమంటూ ప్రోత్సహిస్తున్నాయి. ‘బాగా చదువుకోండి, మంచి గ్రేడ్లు తెచ్చుకోండి’ అంటూ ఇన్నాళ్లూ విద్యార్థులకు హిత వాక్యాలు చెప్పిన చైనా యూనివర్సిటీలు రూట్ మార్చి ‘ఎప్పుడూ ఈ పాఠాలేనా.. ప్రేమ పాఠాలు నేర్చుకోరా? అంటూ.. ఈ వసంత రుతువు సెలవుల్లో ప్రేమలో పడండి.. పూల పరిమళాలను ఆస్వాదించండి’ అంటూ తమ విద్యార్థులను బుజ్జగిస్తున్నాయి. దేశంలో వివాహాలు, యువ జనాభా తగ్గిపోవడంతో అధికారులు ఈ కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు.
‘పూలను చూడండి.. శృంగారాన్ని ఆస్వాదించండి’ థీమ్‌తో ఈ వసంత రుతువు సెలవులు సందర్భంగా సియాచిన్లోని సౌత్‌వెస్ట్ వొకేషనల్ కాలేజ్ ఆఫ్ యానియేషన్ తన విద్యార్థులకు నోట్ పెట్టింది. వేసవి, శీతాకాలపు సంప్రదాయ సమయాలతో పాటు పాఠశాలకు వసంత, శరదృతువు సెలవులను ప్రవేశపెడుతామని చైనా ప్రభుత్వం చెప్పిన రెండు వారాల తర్వాత టీచర్లు, విద్యార్థులు పుస్తకాలను పక్కన పెట్టేయమంటూ మంగళవారం వచ్చిన ఈ నోటీస్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
కాగా, చైనాలో 2025లో కూడా వరుసగా నాలుగో సంవత్సరం జననాల రేటు తగ్గుదల నమోదైంది. ఇది మరింత తగ్గిపోవచ్చునని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా వీటిని ప్రవేశపెడుతున్నది. ప్రజలకు మరింత ఖాళీ సమయం కల్పిస్తే జననాలకు వేదికగా ఉంటుందని భావిస్తున్నది.