Balapur Ganesh Laddu | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట ముగిసింది. ఈసారి లడ్డూకు భారీగా పోటీ నెలకొనగా.. సామ ప్రణీత్ రెడ్డి అత్యధికంగా రూ.39 లక్షలు చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు. దీంతో బాలాపూర్ లడ్డూ వేలంలో మరోసారి భారీ ధర నమోదైంది.
బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వేలం పాట రూ.1,116 ప్రారంభ ధరతో మొదలైంది. ఈ ఏడాది లడ్డూ వేలం కోసం మొత్తం తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఐదు కంపెనీల ప్రతినిధులు ఉండటంతో వేలంలో పోటీ మరింత పెరిగింది. లడ్డూ కోసం కంపెనీలు కూడా బరిలోకి రావడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరకు సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ.35.70 లక్షలకు విక్రయమైంది. ఈసారి రూ.39 లక్షలకు చేరడంతో గతేడాది కంటే రూ.3.30 లక్షలు అధికంగా ధర పలకడం గమనార్హం.
లడ్డూ వేలం ప్రారంభానికి ముందే బాలాపూర్లో సందడి నెలకొంది. వేలం పాటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గ్రామస్థులు, భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో వేలం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇక బాలాపూర్ గణేశ్ నిమజ్జన శోభాయాత్ర, లడ్డూ వేలం నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, షీ టీమ్స్, టాస్క్ఫోర్స్ సిబ్బందిని విధుల్లో ఉంచారు. బాలాపూర్ పరిసరాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు.