– అశ్వారావుపేట నుండి కొత్తగూడెం కలెక్టరేట్ వరకు ఆదివాసీల పాదయాత్ర
– వర్షంలో ఆగని నిరసన
– అదనపు కలెక్టరు హామీతో ఆందోళన విరమణ
కొత్తగూడెం అర్బన్, జూన్ 12 : ‘మా భూమి మకే కావాలి ‘ అని ఆదివాసీలు అశ్వారావుపేట నుండి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. చంటి పిల్లలకు ఎత్తుకొని, యువకులు, వృద్ధులు సుమారు 80 కిలోమీటర్లు 150 కుటుంబాలు మూడు రోజులుగా పాదయాత్ర చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని జోరు వానలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడంతో ఎట్టకేలకు జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వారి సమస్యను సావధానంగా విన్నారు. జిల్లా కలెక్టర్కు సమస్యను వివరించి 10 రోజుల్లోగా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో నివాసం ఉంటున్న ఆదివాసీలు సర్వే నంబర్ 30, 36, 39లో 1954 నుండి 150 కుటుంబాలు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు ఆదివాసి నాయకుడు మడకం నాగేశ్వర్ రావు తెలిపారు. పట్టా పాస్ పుస్తకాలు సైతం ప్రభుత్వం ఇచ్చిందని, అయినప్పటికీ లంకలపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ ఇదే అంటూ, ఇది అటవీ శాఖకు చెందినదని ఆదివాసీలను ఇబ్బందులు పెడుతూ వ్యవసాయం చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు సైతం 2011లో సదరు భూమి సాగు చేసుకుంటున్న 573 ఎకరాలు ఆదివాసీలదేనని స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కోర్టు తీర్పును సైతం అధికారులు అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గత దశాబ్ద కాలంగా అధికారులు ఈ సమస్యను పట్టించుకోకుండా తమను సేద్యం చేయకుండా అడ్డుకుంటున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జాయింట్ సర్వే చేయించి మా భూములు మాకు అప్పగించాలని కోరారు.
అదే విధంగా రామన్నగూడెంలో మంజూరైన నాలుగు ఇందిరమ్మ గృహాలను సైతం గిరిజనేతరులకు కేటాయించి ‘పేసా ‘ చట్టంను తుంగలో తొక్కారని, ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు ఆదివాసి హక్కుల సంఘం, తుడుం దెబ్బ నాయకులు వాసం రామకృష్ణ దొర, ఆరెం ప్రశాంత్ తదితరులు సంఘీభావం తెలిపారు. పది రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే భూమిని స్వాధీనం చేసుకుంటామని అధికారులకు స్పష్టం చేశారు.
Kothagudem Urban : ‘మా భూమి మాకు కావాలి’