– 41వ వర్ధంతి సభలో సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా
బూర్గంపహాడ్, మే 19 : ప్రజా సమస్యల పరిష్కారంలో ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య వీరోచిత పోరాటం చేశారని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ సారపాకలోని సుందరయ్యనగర్లో పాపినేని సరోజిని అధ్యక్షతన జరిగింది. తొలుత బూర్గంపహాడ్ మండల కార్యదర్శి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూమి, భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం ఆ రోజుల్లో పుచ్చలపల్లి పోరాట త్యాగం చేశారని, పేద ప్రజల పక్షాన పోరాడి కూలీ రేట్లు పెంచారన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో సుందరయ్య పోరాట పటిమ ఎనలేనిదని, ఆయన త్యాగాలు ఎప్పటికీ వృథా కావన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై బారాలు మోపుతుందని, అదేవిధంగా రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోతే జూన్ 2న పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, దీనికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌవులూరి నాగమణి, కమటం మరియమ్మ, మీనా, రాము, రమేష్, ఏడుకొండలు, ప్రకాష్, దమయంతి, ఎస్కో.సహీద, మడకం లత, వెంకమ్మ, శివ పాల్గొన్నారు.