రుద్రంపూర్, ఏప్రిల్ 06 : ఈ నెల 4వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు ప్రజలు సహకారం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ కార్యవర్గ సభ్యుడు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఇన్చార్జి గనిగళ్ల వీరస్వామి కోరారు. సోమవారం ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుత పరిస్థితులు సామాన్య ప్రజలకు అనుకూలంగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండి, రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలపై భారంగా మారుతున్నాయని విమర్శించారు. రైతు చట్టాలు, కార్మిక కోడ్లు ప్రజల హక్కులను హరించే విధంగా ఉన్నాయని తెలిపారు.
ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజల ఆస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాటం చేస్తోందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులు, కార్మికులు, పేద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. భూమి హక్కులు, ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో మెరుగుదల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తామని. ప్రజలందరూ తమ వంతు సహాయం అందించి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కొట్టడం ఏరియా బ్రాంచ్ సెక్రటరీ వట్టి కొండమల్లికార్జున్, రుద్రంపూర్ సిపిఐ పార్టీ సెక్రటరీ తోటరాజు రాజేశ్వరరావు, చింతమల్ల విజయరాజు పాల్గొన్నారు.