టేకులపల్లి, జనవరి 06 : ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజా బాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డివిజనల్ ఇంజినీరింగ్ ఆపరేషన్ కొత్తగూడెం రంగస్వామి అన్నారు. టేకులపల్లి మండలంలోని బేతంపూడి గ్రామంలో మంగళవారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించవచ్చన్నారు. ఓల్టేజ్ సమస్యలు, లూస్ వైర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం, బిల్లులు ఎక్కువగా లేదా తక్కువగా రావడం, ట్రాన్స్ఫార్మర్లలో లోపాలు, కరెంట్ వైర్లపై ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడం, ఇండ్లపై నుంచి వెళ్తున్న 11 కేవీ లైన్లు, రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్ స్థంభాల సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా బాట వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజినీరింగ్ టెక్నికల్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణ, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీరింగ్ లక్ష్మీదేవిపల్లి రఘురామయ్య, టేకులపల్లి అసిస్టెంట్ ఇంజినీర్ హాట్కర్ దేవా, సబ్ ఇంజినీర్ ప్రసాద్ పాల్గొన్నారు.