– తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక రాష్ట్ర ముఖ్యసలహాదారు గోపగాని శంకర్రావు
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 22 : ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక రాష్ట్ర ముఖ్యసలహాదారు గోపగాని శంకర్రావు డిమాండ్ చేశారు. మంగళవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక, సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లమోతు సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. పోలవరం రివర్స్ వాటర్‌తో ప్రతి ఏడాది వరదల సమయంలో చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపహాడ్, భద్రాచలం మండలాల ప్రజలు ముంపు బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు వాసులకు మెరక ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చినా హామీ నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నివారించడంలో విఫలమైందన్నారు. ఆంధ్రా ముఖ్యమంత్రితో మాట్లాడి పోలవరం ఎత్తు తగ్గించాలని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించి గిరిజనులకు పక్కా ఇండ్లు నిర్మించాలని, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకాలంలో అనేక కేసులు ఎదుర్కొని విలువైన కాలాన్ని కోల్పోయిన తెలంగాణ యువతరానికి ఉద్యోగ కల్పనలో వయస్సును సడలించాలని, రిజర్వేషన్ సదుపాయం కల్పించాలన్నారు. తొలుత తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు, విద్యావేత్త మహ్మద్ నహీంసాబ్ అకాల మరణం ఉద్యమకారులకు తీరని నష్టమని, ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని సమావేశంలో నివాళులర్పించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బట్టు రాజేందర్‌నాయక్, ప్రధాన కార్యదర్శి పొడియం నరేందర్, జిల్లా కన్వీనర్ మూల నాగిరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ కొక్కొండ ప్రసాద్, నాయకులు తోడేటి సత్యనారాయణ, బాగి వెంకట్రావు, రవికుమార్, దామోదరరెడ్డి, ఉద్యమకారులు దాసరి సాంబయ్య, కరీం, అలీ, హుస్సేన్, అనిల్, పుల్లయ్య, రామాంజరెడ్డి, నర్సింహారావు, రఘు, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.