ఇల్లెందు, మార్చి 28 : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఆటో, మోటర్ కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తానన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐ.కృష్ణ, ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్, తెలంగాణ మోటార్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ అనుబంధం రాష్ట్ర స్థాయి విలీన సభ శుక్రవారం ఇల్లందులో పెన్షనర్ల భవన్లో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి నాగేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో 12 కోట్ల మంది మోటార్ కార్మికులు పనిచేస్తున్నారని. వీరికి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటో, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. నిరుపేద ఆటో మోటార్ కార్మికులకు ఇందిరమ్మ పథకం కింద డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలన్నారు.
2013లో చీలిన మోటార్ యూనియన్లు నేటి నుండి ఒకే యూనియన్‌గా పని చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి.రాసుద్దీన్, తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ.నరేశ్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కొక్కు సారంగపాణి, మోటార్ యూనియన్ల రాష్ట్ర నాయకులు ఎం.మల్లికార్జునరావు, డి.మోహన్ రావు, ఎల్.మారుతిరావు, పోలెబోయిన కిరణ్, కోరం మంగ్ల, రామ్ సింగ్, రామిరెడ్డి, రవి, ఇక్కిరి సిద్ధులు, యనగంటి రమేశ్ పాల్గొన్నారు.
IFTU : ఆటో, మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి : ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ