రామవరం, డిసెంబర్ 09 : ఉద్యోగి తనకు కేటాయించిన పని స్థలాల్లో భద్రతతో పని చేసినట్లయితే సింగరేణిలో జీరో పర్సెంట్ యాక్సిడెంట్‌గా మనం ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని కొత్తగూడెం ఏరియా ఇన్చార్జి జనరల్ మేనేజర్ ఎం.వి నరసింహ రావు అన్నారు. మంగళవారం 56వ వార్షిక భద్రత వారోత్సవాల సందర్భంగా జి.వి.టి.సి (సామూహిక వృత్తి శిక్షణ కేంద్రం), కొత్తగూడెం ఏరియాలో భద్రత వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా భద్రత వారోత్సవాల తనిఖీ బృందంను ఆహ్వానించారు. ముందుగా కొత్తగూడెం ఏరియా ఇన్చార్జి జనరల్ మేనేజర్ ఎం.వి నరసింహ రావు, వార్షిక భద్రత వారోత్సవాల కన్వీనర్ జి.వి.కోటి రెడ్డి, ఎస్.ఓ.టు జీఎం కొత్తగూడెం ఏరియా సభ్యుడు వి.వి. మధుకర్ డిజిఎం (ఎస్ఎంఎంసి), వి.వెంకట రాజు డివైఎస్ఈ (ఈ&ఎం), జి.వి.టి.సి (సామూహిక వృత్తి శిక్షణ కేంద్రం) మేనేజర్ జి.లక్ష్మణ్, జి.వి.టి.సి కార్యాలయం సిబ్బంది, శిక్షణ కోసం వచ్చిన ఉద్యోగులు, అప్రెంటిస్ సిబ్బంది అందరితో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. రక్షణ ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా కళాబృందం భూగర్భ గనిలో పనితీరును వివరించేలా చిరు నాటికను ప్రదర్శించి ఉద్యోగస్తులకు రక్షణ సూత్రాలను మరోమారు గుర్తు చేశారు.
ఈ సందర్బంగా కొత్తగూడెం ఏరియా ఇన్చార్జి జనరల్ మేనేజర్, వార్షిక భద్రత వారోత్సవాల కన్వీనర్ జి.వి. కోటిరెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, భద్రతతో కూడిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతను చేయాలన్నది వారి ముఖ్య ఉద్దేశమన్నారు. పనిలో ఉన్నప్పుడు, బైక్‌పై ప్రయాణించేప్పుడు సెల్‌ఫోన్ వాడొద్దని, హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వి.వి.మధుకర్, వి.వెంకటరాజు, కొత్తగూడెం ఏరియా ఏఐటియూసి యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ వి.మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, కొత్తగూడెం ఏరియా రక్షణాధికారి ఎం.వెంకటేశ్వరరావు, జీవిటిసి మేనేజర్ జి.లక్ష్మణ్, జివిటిసి అధికారి కె.చంద్రశేఖర్, ఇతర అధికారులు, జివిటిసి శిక్షణ పొందుతున్న అభ్యర్థులు, అప్రెంటిస్‌షిప్ అభ్యర్థులు పాల్గొన్నారు.

Ramavaram : రక్షణ సూత్రాలే మనకు శ్రీరామరక్ష : ఎం.వి నరసింహ రావు