రామవరం, ఏప్రిల్ 7: అందరిలాగా తను కూడా ఆ జాతీయ రహదారి వెంబడే వెళ్తున్నాడు. కానీ అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించాడు. ఎవరో వస్తారు.. ఏమో చేస్తారని ఆలోచించకుండా తానే శ్రమించి.. ప్రమాదం లేకుండా చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem) చుంచుపల్లి మండలం రుద్రంపూర్ నివాసి గూడెల్లి యాకయ్య విశ్వమాత మదర్ తెరిస్సా సేవా సంస్థలు నడుపుతున్నాడు. రుద్రంపూర్ ఫిల్టర్ బెడ్ వద్ద ఇటీవల కురిసిన వర్షానికి పక్కనే ఉన్న కొండపై నుంచి వరద విజయవాడ- జగదల్పూర్ జాతీయ రహదారిపై (ఎన్హెచ్ 30) ప్రవహించింది. దీంతో రోడ్డుపై ఇసుకమేటలు పేరుకుపోయాయి. ఓపక్క మూలమలుపు, మరోపక్క ఇసుక మేటలు. ఎవరైనా ద్విచక్ర వాహనదారుడు ఆదమర్చి వాహనం నడిపితే జారిపడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందరిలా తానూ చూసుకుంటూ పోకుండా ఒక్కడే ఎండను సైతం లెక్కచేయకుండా ఇసుక మేటను తొలగించాడు. గమనించిన వాహనదారులు అతనిని అభినందించారు.