పాల్వంచ, ఏప్రిల్ 23 : కార్మిక వర్గానికి గుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మిక వర్గ సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కావాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి పిలుపునిచ్చారు. బుధవారం పాల్వంచ సీఐటీయూ కార్యాలయంలో పట్టణ నాయకుడు మొగిలి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బ్రహ్మచారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మిక వర్గ రక్షణ కోసం జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.
దేశంలో ఉన్న కార్మిక వర్గ రక్షణ కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం, ఉద్యోగ భద్రత కోసం, జీతాల పెంపుదల కోసం, కనీస వేతన అమలు కోసం, పెరిగిన ధరలను తగ్గించడం కోసం జరుగుతున్న పోరాటంలో అంతా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దొడ్డ రవికుమార్, సత్య, ముంతాజ్, రేష్మ, దేవి, రామలక్ష్మి, సువార్త, రమాదేవి, నాగమణి, విజయ, రంగం నాయకులు, రాజేశ్ పాల్గొన్నారు.