బూర్గంపహాడ్, సెప్టెంబర్ 09 : గర్భిణులు, తల్లులు అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పోషక విలువతో కూడిన ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని సెక్టార్ సూపర్వైజర్ స్వరాజ్యం అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ సెక్టార్ పరిధిలోని ఎంపీబంజరు-4 అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ స్వరాజ్యం మాట్లాడుతూ.. తల్లులు, బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం అంగన్వాడీలో అందించే పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. గర్భిణులు తమకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ధనలక్ష్మి, తల్లులు, పిల్లలు, గర్భిణులు పాల్గొన్నారు.