– బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జులై 18 : తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకాన్ని తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షుడు గొట్టేపుల్ల దుర్గా శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పంటల బీమా పథకం తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా అందకపోవడం వల్ల రైతాంగం తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలం, యాసంగి పంటలన్నింటినీ దీని పరిధిలోకి తెచ్చి, కౌలు రైతులకు సైతం న్యాయం జరిగేలా పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతి మండలంలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని కోరడం జరిగింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, జాటోత్ వెంకన్న, దురిశెట్టి కుమార్, మోహనకృష్ణ, సముద్రాల గాయత్రి, రాపాక రమేష్, మిట్టపల్లి శ్రీనివాస్, నాగుల్ చందు, వెంకటేష్ మరియు బిజెపి మహిళా నాయకురాళ్లు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.