– రుద్రంపూర్లో యువకుల అరాచకాలు
– భయాందోళనలో ప్రజలు
రుద్రంపూర్, మే 19 : మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయని రుద్రంపూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు శాంతిభద్రతల వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మత్తులో యువకులు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి నెలకొంటుంది. గ్రామంలో మాదకద్రవ్యాలు, మద్యం సేవించి వీధుల్లో హల్చల్ చేస్తూ సామాన్యులపై దాడులకు దిగుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.
యువతకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడం, పోలీసుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల పరిస్థితులు రోజురోజుకీ అదుపు తప్పుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెల 28న మత్తులో ఉన్న ఓ యువకుడు షాపు ముందు నిలిపి ఉంచిన ఆటో అద్దాలను ధ్వంసం చేసిన ఘటన షాపు యాజమాని సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఆ ఘటన మర్చిపోక ముందే ఈ నెల 17న మరోసారి మద్యం మత్తులో షాపు ముందు ఉంచిన ఆటోను యాజమానికి తెలియకుండా తీసుకెళ్లే క్రమంలో ట్రాలీ ఆటో బోల్తాపడింది. ఆ సమయంలో ఎవరైనా ఎదురై ఉంటే ప్రాణనష్టం జరిగేదని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా ఫోన్ ఇవ్వలేదనే నెపంతో రిజ్వాన్, షఫీ అనే వ్యక్తులపై దాడి జరిగినట్లు బాధితులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. గతంలో చిన్న ఫిర్యాదులకే వెంటనే స్పందించే పోలీసులు ఈ ఘటనల్లో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల నిర్లక్ష్యంతో అల్లరి మూకలు మరింత రెచ్చిపోతున్నాయని, వెంటనే మాదకద్రవ్యాలు మత్తుపదార్థాలు సేవించే ఎస్ఆర్టి ఏరియా, ప్రొఫెసర్ జయశంకర్ మైదానం, రుద్రంపూర్ ఈద్గా ప్రాంతం, గౌతమ్ పూర్ టీటూ ప్రాంతంలోనీ పార్కు, గౌతమ్ పూర్ లో నూతనంగా నిర్మించిన ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి మాదకద్రవ్యాల సరఫరాపై దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలోకి మాదకద్రవ్యాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరెవరు వినియోగిస్తున్నారు? అనే దానిపై సమగ్ర విచారణ జరిపి, అలవాటుకు బానిసైన వారిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే, మత్తులో యువకులు చేసే దారుణాలకు అమాయక ప్రజలే బలవుతారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

మత్తు మాఫియాపై పోలీసుల నిర్లక్ష్యం..!