– సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పోడు పట్టాలు ఇవ్వాల్సిందే
– పంటలను ధ్వంసం చేసే చర్యలు మానుకోవాలి
– అధికారులకు సీపీఐ నాయకుల హెచ్చరిక
కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 08 : పోడు వ్యవసాయం గిరిజనుల హక్కు అని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుని జీవిస్తున్న గిరిజన, గిరిజనేతర సాగుదారులపై అటవీ శాఖ అధికారులు చేస్తున్న దాడులు, దౌర్జన్యాలను మానుకోవాలని హితవు పలికారు. స్వేచ్ఛగా సాగు చేసుకునే వెసులుబాటు కల్పించాలని, అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీకేఎంయూ, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వలస ఆదివాసీలకు కుల ధృవీకరణ పత్రాలు అందించాలని, ఏజెన్సీ ప్రాంతంలో పేదలు పోడు సాగు చేసుకొని పట్టెడు మెతుకులు తింటున్నారని, వీరి భూములు లాక్కొని మళ్లీ అడవిలో దుంపలు తినే స్థితికి తీసుకురావద్దని కోరారు.
అనాదిగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో కందకాలు తవ్వి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేస్తూ, మొక్కలు నాటి బలవంతంగా భూములు లాక్కునే చర్యలు, పేదలపై పాలకులు యుద్ధం ప్రకటించినట్లుగా స్పష్టమవుతోందన్నారు. ఈ చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం ద్వారా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందుకున్న పోడు రైతుల భూములను సైతం లాక్కుంటూ అమాయక గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విధానం సరైంది కాదన్నారు. ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచి రోజుకు రూ.700ల కూలీ చెల్లించాలని, సమగ్ర కేంద్ర వ్యవసాయ కార్మిక చట్టాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి దశాబ్దాల క్రితం ఈ జిల్లాకు వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఆదివాసీలకు ఎస్టీ ధ్రువ పత్రాలు మంజూరు చేసి, సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీసంశెట్టి పూర్ణచందర్ రావు, రేసు ఎల్లయ్య నాయకులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, నరాటి ప్రసాద్, ఎస్ డి సలీం, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బంధం నాగయ్య, ఎండి యూసుఫ్, పేరాల శ్రీనివాస్, అనంతనేని సురేష్, జి రామకృష్ణ, సాప్క నాగేశ్వరరావు, సుంకిపాక ధర్మ, విజయ్, కొమరం హన్మంతరావు, బొర్రా కేశవరావు పాల్గొన్నారు.
Kothagudem Urban : పోడు వ్యవసాయం గిరిజనుల హక్కు : ఎస్కే సాబీర్ పాషా