జూలూరుపాడు, జూలై 03 : ఆధునిక మానవ జీవన విధానాన్ని శాసిస్తూ, పర్యావరణ ఉనికికే ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ మహమ్మారిపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్లాస్టిక్ లేని రోజును ఊహించుకోలేని స్థితికి నేటి సమాజం చేరుకున్న తరుణంలో, ప్రపంచ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం ప్రభుత్వాల చట్టాలు, జీవోల ద్వారా మాత్రమే ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యం కాదని, ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ పెరిగినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని నిరూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు తిప్పర్తి శివ.
ప్రభుత్వ ఉద్యోగి అయిన తిప్పర్తి శివ ప్లాస్టిక్ నివారణను కేవలం ఒక నినాదంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించారు. ప్రపంచ ప్లాస్టిక్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి మండల కేంద్రంలో శుక్రవారం వినూత్న రీతిలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఒక చేతిలో మైక్ పట్టుకుని ప్లాస్టిక్ వల్ల పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ, మరో చేతిలో ప్లకార్డులు చేతబూని ఆయన చేసిన ప్రసంగం స్థానికులను ఎంతగానో ఆలోచింపజేసింది. ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రదర్శనగా సాగిన ఈ ర్యాలీలో ప్రజలకు కరపత్రాలు పంచుతూ, ప్లాస్టిక్ అనర్థాలపై విస్తృతమైన చైతన్యాన్ని రగిలించారు.
ఈ అవగాహనా ర్యాలీలో తిప్పర్తి శివ స్వయంగా ప్లాస్టిక్ వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న దుస్తులను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్లాస్టిక్ కవర్ వద్దు – బట్ట సంచి ముద్దు, ప్లాస్టిక్ నివారణ మహా యజ్ఞాన్ని జయప్రదం చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ వారి కుటుంబ సభ్యులు ప్రదర్శించిన ప్లకార్డులలోని నినాదాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తక్షణమే తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.