ఇల్లెందు, జూలై 24 : జీసీసీ (గిరిజన కోఆపరేటీవ్ కార్పొరేషన్) హమాలీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని టీయూసీఐ నాయకుడు, హమాలీ యూనియన్ సెక్రటరీ బోల్లా సీతారాములు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ఈ నెల 26న జీసీసీ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ హమాలీ అండ్ రైస్ మిల్ వర్కర్స్ యూనియన్, టీయూసీఐ బ్రాంచ్ కమిటీ సమావేశం గురువారం ఇల్లెందులోని ఎల్లన్న భవనంలో జరిగింది. ఈ సమావేశంలో సీతారాములు మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, 282 జీఓని రద్దు చేయాలని, కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ నెల 31న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
హమాలీలకు సమగ్రమైన వేతన చట్టం అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హమాలీ కార్మికుల సేవలను గుర్తించాలన్నారు. ఏండ్ల తరబడి జీసీసీలో పనిచేస్తున్న హమాలీలకు కనీస వేతనం గానీ, సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదన్నారు. ఈ సమావేశంలో మోటం సంపత్, సందీప్, ఈసాల వెంకన్న, చందర్, కంబాల భిక్షపతి, నాగేశ్ పాల్గొన్నారు.