జూలూరుపాడు, జూన్ 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కెట్ నెలకొల్పాలని న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎస్కే ఉమర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కేంద్రంలో శాశ్వత మార్కెట్ లేకపోవడం వల్ల ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల మార్కెట్ కు అనుసంధానంగా సబ్ మార్కెట్ పై ఆధారపడాల్సి వస్తుందన్నారు. జూలూరుపాడు మండలంలో శాశ్వత మార్కెట్ లేకపోవడం వల్ల భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చే రైతాంగమంతా ఖమ్మం పోవాల్సి వస్తుందని, ఇక్కడ వర్కర్స్ బయట మార్కెట్ కు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇక్కడ కార్మికులకు, రైతాంగానికి శాశ్వత మార్కెట్ యార్డ్ నెలకొల్పడం వల్ల ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
అనేకమార్లు దరఖాస్తు చేసుకున్న శాశ్వత మార్కెట్ ఏర్పాటు కోసం అధికారులు, ప్రభుత్వం కృషి చేయడం లేదన్నారు. గతంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేని కలిసి వినతిపత్రం సమర్పించినప్పుడు గత నెల చివరినాటికే మార్కెట్ వస్తుందని హామీ ఇవ్వడంతో దశల వారి ఆందోళనలు నిలిపివేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మార్కెట్ రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు మార్కెట్ పై ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, లేనిచో దశల వారి ఆందోళన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వన్ రోజు రమేశ్, మండల నాయకులు గోపి, కూరాకుల నరసింహారావు, జాటోతు నరసింహారావు, సీతయ్య, కల్తి నరసింహారావు, కల్తీ రామయ్య, శీలం రవి పాల్గొన్నారు.