బోనకల్లు, ఏప్రిల్ 17 : బీఎస్ఎన్ఎల్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అడ్వైజరీ కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించాలని ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, రామ సహాయం రఘురాంరెడ్డి అన్నారు. గురువారం భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) రీజినల్ టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశం నల్లగొండ సమీపంలోని పానగల్ ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీలు ముఖ్య అతిథిలుగా హాజరై మాట్లాడారు. బీఎస్ఎన్ఎల్ సంస్థను బలోపేతం చేసి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రైవేట్ టెలికాం సంస్థలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ సంస్థను అగ్రభాగాన నిలపాలని అధికారులకు సూచించారు. మారుమూల ఏజెన్సీ, కొండ ప్రాంతాల వారికి కూడా బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తరించి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.
అవసరమైన చోట కొత్త టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని, అదేవిధంగా 2జి, 3జి, 4జి, 5జి సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. బీఎస్ఎన్ఎల్ సంస్థను మరింత విస్తృత పరచటానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి అడ్వైజరీ కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించాలని కోరారు. అనంతరం ఖమ్మం జిల్లాకి సంబంధించిన టెలికామ్ అడ్వైజర్ కమిటీ సభ్యులను సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పాశ్యం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ గురువయ్య, అధికారులు రవి ప్రసాద్, మురళీ కుమార్, టీఏసీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఎస్కే.ఇమామ్ సాహెబ్, యసా వేంకటేశ్వర్లు, అమరవాది సత్యనారాయణరెడ్డి, మచ్చా రామారావు, బానోతు రంజిత్ నాయక్, పల్లెల రామలక్ష్మయ్య, బడసు కనకరాజు పాల్గొన్నారు.