– ప్రమాదభరితంగా కొత్తగూడెం-విజయవాడ రహదారి
– గాల్లో కలిసిపోతున్న మనుషుల ప్రాణాలు
– అదేతీరుగా మూగ జీవాలు
– పోలీస్, రవాణా, లేబర్ అధికారుల వైఫల్యం
రామవరం, మే 22 : కొత్తగూడెం-విజయవాడ రోడ్డులో బొగ్గు టిప్పర్లు ప్రయాణికుల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారాయి. చాలా మంది డ్రైవర్లు తరచుగా నిర్లక్ష్యంగా నడుపుతుండడంతో మనుషులు, మూగ జీవాల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. సత్తుపల్లిలోని జీవీఆర్ఓసీ, కిష్టారం ఓపెన్ కాస్ట్ నుండి ఆర్సీహెచ్పీకి బొగ్గు రవాణా చేసే టిప్పర్లను చూస్తేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ ప్రాంతంలో సత్తుపల్లి నుండి రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఆర్సీహెచ్పీ) వరకు ఎక్కడో ఒకచోట రోడ్డుపై ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోవడం, రోడ్డు దాటుతున్న వ్యక్తులు, మూగజీవులు టిప్పర్లు ఢీకొని మృతి చెందడం, లేదా క్షతగాత్రులు కావడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. గడిచిన మంగళవారం యర్రగుంటకు చెందిన షేక్ మౌలానా అనే వృద్ధుడు టిప్పర్ ఢీకొని చనిపోయాడు. అదే రోజు అర్ధరాత్రి మరొక బొగ్గు టిప్పర్- కారును ఢీకొన్న దుర్ఘటనలో తల్లీకొడుకు మృతిచెందారంటే ప్రమాదాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
సత్తుపల్లి నుండి ఆర్సీహెచ్పీ కి రోజుకు సుమారు 70 లారీలు నాలుగు నుంచి ఐదు ట్రిప్పులుగా బొగ్గు రవాణా చేస్తాయి. ఈ వాహనాలను నడిపే డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి స్థానికులు అంటున్నారు. ఒకరోజు పని చేస్తే మరొక రోజు సెలవు ఇస్తారు కావునా ఒక్కొక్క డ్రైవర్ 24 గంటలు పని చేయాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా నాలుగు ట్రిప్పుల గాను ఐదో ట్రిప్పు వేస్తే రూ.200 ఇన్సెంట్ ఇస్తారు. ఇన్సెంటివ్ ఆశతో తొందరగా చేరుకోవాలని వేగంగా వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు కారణంగా ఉందన్నారు. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వారు ఒత్తిడికి లోనై ఏదో ఒక సందర్భంలో నిద్రలోకి జారుకుని ప్రమాదాలు చేస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి డ్యూటీ టైమ్ను మార్చాలని కోరుతున్నారు.
లేబర్ లా ప్రకారం వ్యక్తి 8 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ గంటలు పని చేస్తే ఓ.టి ఇవ్వాలి. అది ఏమి కనబడదు ఇక్కడ కేవలం 24 గంటలు పని చేస్తే జీతం చెల్లిస్తున్నారు. దీంతో గత్యంతరం లేకనే పనిచేయాల్సి వస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు. డ్రైవర్లకు తగినంత విశ్రాంతి లేకనే తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వరుస ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నా, ప్రమాదాలకు గల కారణాలు గానీ, నివారణ చర్యలు గానీ చేపట్టడం లేదు. ఇప్పటికైనా పోలీస్, రవాణా, కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సంస్థలు, వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శంకర్రావును వివరణ కోరగా తమకు ఏ డ్రైవర్ కూడా ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
Ramavarm : అయ్యబాబోయ్ బొగ్గు టిప్పర్లు