కొత్తగూడెం అర్బన్, మే 20 : తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు జూన్ 2వ తేదిన పెన్షన్ ప్రకటించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 200 గజాల స్థలం ఇవ్వాలని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణబోయిన నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కూలైలైన్ లోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం 1969 నుండి 2014 వరకు వివిధ దశల్లో ఉద్యమం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి కొత్తగూడెం ఉద్యమకారులు అలుపెరుగని కృషి చేశారని గుర్తు చేశారు.
అనేకమార్లు ఉద్యమకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఎం.వీ.రెడ్డి , ప్రియాంక, ప్రస్తుత కలెక్టరు జితేశ్.వి.పటేల్ ను కలిసి విన్నవించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం.వలిబాబా కూచనకృష్ణారావు, దామర కొండ మల్లయ్య, కాకెళ్లి సైమన్, దేవులపల్లి రామ్మూర్తి, ఏలూరు రాములు, శ్రీపాద సత్యనారాయణ, సత్తార్, బేగ్ అబ్దుల్ సలీం పాల్గొన్నారు.