కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 28 : ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అఖిలపక్ష నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు పార్టీలు, సంఘాల నాయకులు మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక మావోయిస్టు పార్టీని ఆపరేషన్ కగార్ పేరుతో అంతం చేస్తామని, మార్చి 2026 నాటికల్లా నక్సల్స్ లేకుండా చేస్తామని ప్రకటిస్తూ, కార్పొరేట్ సంస్థలకి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను అప్పగించడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోందని ఆరోపించారు.
ఆదివాసి ప్రాంతాల్లో 89 రకాల ఖనిజ సంపద ఉన్నదని, దానిని స్వాధీనపరచుకోవడం కోసం దాడులు, అత్యాచారాలు, ఎన్కౌంటర్లు చేస్తున్నారని, 280 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన కర్రెగుట్టను లక్ష్యంగా చేసుకుని వేలాది మంది సైన్యం జల్లెడ పడుతుందన్నారు. తక్షణమే కర్రెగుట్టకు వెళ్లిన సైన్యాన్ని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు కొనసాగించాలని, ప్రజాస్వామికంగా వ్యవహరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగ సీతారాములు, సీపీఐ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సలివిడి శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు లిక్కి బాలరాజు, టీజేఎస్ రాష్ట్ర నాయకుడు మల్లె రామనాథo, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.ఉపేందర్, ఐలు జిల్లా అధ్యక్షుడు రమేశ్‌కుమార్ మక్కడ్, ఆల్ ఇండియా ట్రైబల్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ సూర్ణపాక నాగేశ్వర్రావు, బీసీ సంఘం నాయకుడు సైదుబాబు, ఏఐకేఎంఎస్ జిల్లా అద్యక్షుడు తుపాకుల నాగేశ్వర్రావు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు జె.సీతారామయ్య, వై. గోపాలరావు, పృధ్వీ, మోత్కూరి మల్లికార్జునరావు, మంజుల, ఎట్టి ప్రశాంత్, అలీముద్దీన్, ప్రణయ్, కిరణ్, బుచ్చయ్య దొర పాల్గొన్నారు.