కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 06 : బీజేపీని ఓడించేందుకు కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని, బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో స్థానిక ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటామని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మెచ్చా వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని మంచికంటి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కొంత గందరగోళంగా ఉందని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ఆధారంగా ఎన్నికలకు సిద్ధమవుతామని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల గందరగోళం నెలకొనే పరిస్థితి ఉందని, దీనిపై ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని కోరారు.
బీజేపీతో అధికార భాగస్వామిగా ఉన్న ఏ పార్టీతో కూడా తాము పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాము 120 సర్పంచ్, 80 ఎంపీటీసీలు, 8 ఎంపీపీ, 8 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నామని, పొత్తు ప్రతిపాదనకు ఒప్పుకునే పార్టీలతో కలిసి పోటీ చేస్తామని, లేనిపక్షంలో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. గతంలో సీపీఎం గెలిచిన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్ది అవార్డులను సైతం పొందామని, సుపరిపాలన అందించే సీపీఎంకు పట్టం కట్టాలని ప్రజలను ఆయన కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కె.బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.