రామవరం, జూలై 23 : సింగరేణి సంస్థలో తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ప్రతినిధి బృందం చేసిన విజ్ఞప్తికి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం సానుకూలంగా స్పందించారు. బుధవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్ లో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. గడిచిన సంవత్సరం కాలంగా మెడికల్ బోర్డులో హయ్యర్ సెంటర్ కు రిఫరల్ కాబడిన రోగులను అన్ ఫిట్ చేయకపోవడం, విధులకు అనుమతించక పోవడం వల్ల ఆర్థికంగా, మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, వైద్యశాలల్లో బిపి, షుగర్ తో పాటు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. సింగరేణి పరిశ్రమను కాపాడుకోవడానికి కొత్త బొగ్గు గనులు ప్రారంభించడానికి తక్షణమే కార్యచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో అవసరమైన యంత్రాలను తక్షణమే కొనుగోలు చేసి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు కృషి చేయాలని అన్నారు. పాత యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి చేయటం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఉత్పత్తి లక్ష్య సాధనలో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, పుట్ట మధు, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్య, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి పాల్గొన్నారు.