భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 03 : ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న లోపం తలెత్తకుండా అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని ఎన్నికల పరిశీలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాలను సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ముందుగా పాల్వంచ మండలంలోని అనుబోస్ కాలేజీలో నిర్వహిస్తున్న ఆర్ఓ, ఏఆర్‌ఓల శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బూర్గంపహాడ్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, భద్రాచలం మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి అందజేస్తున్న నామినేషన్ ప్రక్రియ, కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల రోజున చేపట్టాల్సిన వివిధ విధులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనవని, ప్రతి ఆర్ఓ, ఏఆర్ఓ తమకు కేటాయించిన విధులను అత్యంత జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. చిన్న తప్పిదం కూడా ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున ప్రతి చర్యలో జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని సూచనలు, మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు, సిబ్బందిని ఆయన ఆదేశించారు.
తదుపరి లక్ష్మిదేవిపల్లి మండలంలోని జీపీ లక్ష్మిదేవిపల్లి, జీపీ శ్రీనగర్ కాలనీ అలాగే సుజాత్‌నగర్ మండలంలోని జీపీ సీతంపేట బంజారా, జీపీ సర్వారం కేంద్రాలను ఆయన సందర్శించారు. నామినేషన్ స్వీకరణ, రికార్డు నిర్వహణ, భద్రత, సిబ్బంది హాజరు, క్యూలైన్ వ్యవస్థ మొదలైన అంశాలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.