టేకులపల్లి, జనవరి 08 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎస్లో గురువారం ఎంఈఓ జగన్ మధ్యాహ్న భోజనం నిర్వహణ, స్కావెంజర్ పనితీరుపై విచారణ చేపట్టారు. బుధవారం నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్‌లో వచ్చిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. స్కూల్లో ఉపాధ్యాయురాలు, వంట నిర్వహకురాలు, స్కావెంజర్‌ను విచారించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని, వంటశాల, స్టోర్ రూమ్ తాళాలను హెచ్ఎం వద్దే ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి రోజు నాణ్యమైన భోజనం పెడుతున్నరా లేదా పర్యవేక్షించాలని హెచ్ఎంను ఆదేశించారు.
వంటశాలలో దాచిన 117 కేజీల బియ్యంపై పంచానామ నిర్వహించి, స్థానిక డీలర్ గుగులోత్ హేమచందర్ కు అందజేసి, విషయాన్ని ఉన్నతాధికారులకు వెల్లడించినట్లు ఆర్ఐ రత్తయ్య తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం డీవైఎఫ్ఏ జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భయ్య అభిమన్యు మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయాలన్నారు. వంట నిర్వహకురాలిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్‌ను పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

Tekulapalli : ‘నమస్తే’ కథనానికి స్పందన.. బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎస్లో అధికారుల విచారణ