– వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలి
– సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా
జూలూరుపాడు, మే 15 : రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో ‘తరుగు’ పేరుతో క్వింటాకు ఐదు కిలోల చొప్పున కోత విధిస్తూ అన్నదాతలను నిలువు దోపిడీ చేస్తున్నారని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో వలమల్ల సామేలు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సీపీఐ మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోవడానికి వస్తే, ఏదో ఒక సాకుతో అడ్డగోలుగా కోత విధిస్తూ రైతులను వంచించడం అన్యాయమని మండిపడ్డారు. ఇప్పటివరకు తరుగు పేరుతో ఎంతైతే ధాన్యం విలువను కోత పెట్టారో, ఆ సొమ్మును తక్షణమే లెక్కకట్టి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలైన టార్పాలిన్లు, గిడ్డంగి వసతి, తాగునీరు, ఎండ నుంచి రక్షణ కల్పించే నీడ వంటి వసతులు కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన తూర్పారబట్టారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చండ్ర నరేంద్ర కుమార్, మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, నాయకులు ఎల్లంకి మధు, యాస రోశయ్య, తూము కోటయ్య, పోనేకంటి వెంకటేశ్వర్లు, కంచర్ల రాఘవేంద్రరావు, సిరిపురపు వెంకటేశ్వర్లు, కొండ వీరయ్య, చిమట ముత్తయ్య, పాలెపు ప్రభాకర్, ఊడల సుధ, బరగడ రమేష్, పత్తిపాటి మహేష్, ఉదారి నాగయ్య, చల్లగొండ్ల సతీష్, చీమకుర్తి సంతోష్, యరాదశి రామారావు పాల్గొన్నారు.

‘తరుగు పేరుతో రైతును దోపిడీ చేస్తున్న అధికారులు’