– సభా ప్రాంగణంలో దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు
బూర్గంపహాడ్, ఆగస్టు 27 : బూర్గంపహాడ్ మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో గురువారం ఉదయం నిర్వహించాల్సిన గ్రామ సభకు అధికారులు డుమ్మా కొట్టడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సర్ ప్రోగ్రామ్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రజల సమక్షంలో చదివి వినిపించేందుకు ఉదయం 10.30 గంటలకు గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిర్ణీత సమయానికి సంబంధిత రెవెన్యూ, బూత్ స్థాయి (బీఎల్వో) అధికారులు హాజరు కాకపోవడంతో గ్రామ సభ సభా ప్రాంగణం వెలవెలబోయింది. ఓటర్ల జాబితాలో తమ పేర్ల వివరాలు సరిచూసుకునేందుకు గ్రామంలోని 18 వార్డులకు సంబంధించిన ప్రజలు చెప్పిన సమయానికి గ్రామ సభకు చేరుకున్నారు.
కానీ అక్కడ గ్రామసభలో ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడం, సంబంధిత రెవెన్యూ, బూత్ స్థాయి అధికారులు కనిపించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విషయంలో అధికార యంత్రాంగం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరుపై స్థానికులు, ప్రజలు, పలు పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా సంబంధిత అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది గ్రామసభకు ఎందుకు రాలేకపోయారు…ముందస్తు సమాచారం లేకుండా సభను రద్దు చేశారా… అనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించి గ్రామసభలు తూతూమంత్రంగా కాకుండా పకడ్బంధీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.