– అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఫైర్
బూర్గంపహాడ్, ఏప్రిల్ 15 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో ఎలాంటి పురోగతి లేదని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అధికారుల్లో నిర్లక్ష్యం, అలసత్వం కనిపిస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారంర బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక వాసవీ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గస్థాయి ఏడు మండలాల హౌసింగ్ డీఈ, ఏఈలు, తాసీల్దార్లు, ఎంపీడీఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడు మండలాల్లో 8,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, అంతేకాకుండా ఎస్టీ కోటా కింద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో మరో 1,000 ఇళ్లు మంజూరు చేశామన్నారు. అయితే ఫిబ్రవరి 18న సమీక్ష సమావేశం నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అయితే అప్పటికీ ఇప్పటికీ తాజాగా జరిగిన సమీక్షా సమావేశంలో అధికారుల పనితీరులో ఎలాంటి పురోగతి లేదని మండిపడ్డారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయడంలో ఇతరత్రా సమస్యలను పరిష్కరించడంలో సంబందిత శాఖల అధికారులు కొన్నిచోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇంట్లో ఉంటే పనులు ఎలా పూర్తవుతాయని ఇది మంచి పద్ధతి కాదని.. గ్రామాల్లో ఫీల్డ్ వర్క్ చేసి లబ్దిదారులు. త్వరితగతిన ఇళ్లు పూర్తి చేసుకునేలా చూడాలని హౌసింగ్ డీఈతో పాటు ఏరులు, ఇతరశాఖల అధికారులను ఎమ్మెల్యే మందలించారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తిచేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం లబ్దిదారులకు రూ.5 లక్షలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంజూరు చేసిందని, ఆ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి వారి కలను సాకారం చేయాలన్నారు. మండలాల్లో తాసీల్దార్లు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలని సూచించారు. గతంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మే నెలాఖరు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.
వానాకాలం వస్తే ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగే పరిస్థితి ఉండదని అధికారులు తమ తమ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని, లబ్దిదారులకు ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా చూడాలని, చిల్లులు సైతం సకాలంలో మంజూరయ్యేలా చూడాలన్నారు. శాఖాపరంగా అధికారుల పనితీరును గమనిస్తుంటానని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ డీఈ సచైరామ్, బూర్గంపహాడ్ ఎంపీడీఓ జమలారెడ్డి, తాసీల్దార్ జేఆర్కే ప్రసాద్, ఏడు మండలాల తాసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఈలు ఉదయకిరణ్, పావని, సంతోష్, వినీత, వెంకటేష్, శ్రావణి, రాజేశ్ పాల్గొన్నారు.