రామవరం, సెప్టెంబర్ 17 : ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి (బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ నెల 15న జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం సందర్భంగా సూచించారు. అయితే బ్లాక్ స్పాట్స్ గుర్తించే అంశంలో కింద స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల వాహనదారుల్లో పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, మరికొందరు క్షతగాత్రులు అవుతున్నారు. రోడ్డు ప్రమాదం కేసులను నమోదు చేస్తున్నారే తప్పా, వాటి నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. కొత్తగూడెం టూ టౌన్ పరిధిలో ఇటీవల ఇద్దరు ఆటో డ్రైవర్లు మృతి చెందగా, మంగళవారం జరిగిన ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి, కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నారు.
ఈ స్టేషన్ పరిధిలో రాంపురం వద్ద, అంబేద్కర్ నగర్, రుద్రంపూర్ ప్రగతివనం, ధన్బాద్ మలుపు వద్ద, 4 ఇంక్లైన్, సింగరేణి కోల్ టెస్టింగ్ ల్యాబ్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతంలో పైనుండి వచ్చే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఏమైనా ఏర్పాటు చేస్తే జనాల ప్రాణాలు గాలిలో కలవకుండా ఉంటాయి. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ నెలవారి సమీక్ష సమావేశంలో చెప్పిందే కాకుండా బ్లాక్ స్పాట్స్ గుర్తించారా గుర్తిస్తే, ఎలాంటి చర్యలు తీసుకున్నారు వంటి అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని పరిశీలిస్తే బాగుంటుందని వాహనదారులు కోరుతున్నారు.
Ramavaram : ఎస్పీ ఆదేశాలు బేఖాతరు.. బ్లాక్ స్పాట్స్ గుర్తింపులో నిర్లక్ష్యం