భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. మంగళవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులు మీదుగా కలెక్టర్ అవార్డును అందుకోనున్నారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి సౌత్ జోన్ 3లో అవార్డును సొంతం చేసుకున్నారు. తెలంగాణలో 33 జిల్లాల్లో ఆరు జిల్లాలను ఎంపిక చేయగా అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా ఈ అవార్డు దక్కింది. అవార్డుతో పాటు రూ.25 లక్షల నగదు బహుమతి అందుకోనున్నారు.
గత మే నెల 1వ తేదీన ప్రారంభించిన జలశక్తి పనులను కలెక్టర్ తానే స్వయంగా పరిశీలిస్తూ పర్యవేక్షించారు. ఇంకుడు గుంతలు, పారంపాండ్లు, వాటర్ కన్జర్వేషన్ పనులు ఈ ఏడాది మే నెల 31వరకు 29,103 పనులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలో అన్ని శాఖల అధికారుల భాగస్వామ్యంతో చకచకా పనులు చేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఈ అవార్డు దక్కింది. డీఆర్డీఏ విద్యాచందన కూడా ఈ అవార్డు స్వీకరణలో పాల్గొననున్నారు.
జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న అతి తక్కువ కాలంలో జితేశ్ వి పాటిల్ కు ఏడాదిలో మూడు అవార్డులు రావడం జిల్లాకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. గతేడాది నీతి అయోగ్ అకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో భాగంగా విద్య, వైద్యం, వ్యవసాయం, మౌళిక సదుపాయాల అమలులో భాగంగా వంద శాతం సంపూర్ణ అభివృద్ధి సాధించడంలో ముఖ్యపాత్ర పోషించారు. జిల్లాలో గుండాల మండలం బ్లాక్ స్థాయిలో ఐదు సూచికలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. వెనుకబడిన జిల్లాల ప్రగతిని గుర్తించిన కేంద్రస్థాయి అధికారులు రాజ్భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డును ప్రధానం చేశారు. అంతేకాకుండా నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డుతో పాటు ఓపెన్సోర్స్లో ప్రతిభ కనబరిచిన కలెక్టర్ కు బాంబేలో ఈ అవార్డును ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. అనతి కాలంలో ఏడాదిలో మూడు అవార్డులు అందుకున్న కలెక్టర్కు జిల్లా అధికారులు అభినందనలు తెలుపుతున్నారు.