జూలూరుపాడు, మార్చి 28 : తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన చండ్ర నరేంద్రకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ పట్టణంలో జరిగిన రాష్ట్ర రైతు సంఘం మూడో రాష్ట్ర మహాసభలో ఎన్నుకున్నట్లు శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపారు. 109 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు, 21 మంది నూతన ఆఫీస్ బేరర్లుగా ఎన్నికైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు రైతాంగం ఆర్థికంగా దిగజారుడు పరిస్థితిలోకి నెట్టి వేయబడుతుందని, దివాలాకోరు రాజకీయలతో పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగానికి దేశవ్యాప్తంగా ఉన్న ఏడు లక్షల కోట్ల రుణం మాఫీ చేయడానికి కుంటి సాకులు చెబుతున్నకేంద్ర ప్రభుత్వం, మోడీ అధికారంలోకి వచ్చాక 16.5 లక్షల కోట్ల కార్పొరేట్ కంపెనీల రుణాలను రైట్ ఆఫ్ చేసినట్లు తెలిపారు. 758 మంది రైతులు ప్రాణత్యాగం చేసి వేలాది మంది రైతులు ఢిల్లీని ముట్టడించి నల్ల చట్టాలను రద్దు చేయిస్తే, మళ్లీ జాతీయ మార్కెట్ విధానం పేరుతో దొడ్డిదారిన ప్రవేశపెట్టాలని చూస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి ప్రభుత్వాల ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ఎండకడతామని ఆయన పేర్కొన్నారు.