రామవరం, డిసెంబర్ 19 : లోక నాయకుడి నామస్మరణతో నిత్యం మారుమ్రోగిపోయే తిరుమల కొండల్లో ప్రకృతిని కాపాడండంటూ హరిత దీక్షకురాలు నైనిక చేసిన వినూత్న ప్రచారానికి ప్రశంసల జల్లు కురుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న నైనిక రజువా శ్రీనివాసుడి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సందర్భంగా అలిపిరి వద్ద నుంచి మెట్ల మార్గంలో నడుచుకుంటూ కొండపైకి చేరుకుంది. ఈ క్రమంలోనే వీపునకు మొక్కను తగిలించుకుని, ముఖానికి ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని.. నేడు మనం మొక్కలను నాటి వాటిని సంరక్షించకపోతే భవిష్యత్లో మనం ఇలా మొక్కలను వీపుకు తగిలించుకునే పరిస్థితి వస్తుందంటూ 3,550 మెట్లు ఎక్కి చేసిన వినూత్న ప్రచారానికి భక్తుల నుండి సానుకూల స్పందన లభించింది.
మెట్ల మార్గంలో అలిపిరి, హనుమాన్ ఆలయం, మోకాళ్ల పర్వతం ప్రాంతాల్లో భక్తులు నైనిక రజువా చేపట్టిన ప్రచార వివరాలను అడిగి తెలుసుకుని నైనిక చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. భక్తులకు పచ్చదనం ప్రాధాన్యతను వివరిస్తూ, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకోవడం ఎంత అవసరమో వివరించింది. తిరుమల చేరుకున్న అనంతరం వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పచ్చదనాన్ని పెంపొందించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేసింది. తిరుమల ప్రాంగణంలో స్వామివారి సన్నిధిలో మారేడు, సింధూరపు మొక్కలను నాటింది. చిన్న వయస్సులోనే పర్యావరణంపై బాలిక చూపిన ఈ చైతన్యానికి భక్తులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు.